Facebook Twitter Google RSS

ప్రజా ఉద్యమంగా స్వచ్ఛ భారత్

Unknown     11:00 AM  No comments

 స్వచ్ఛ భారత్ ప్రభుత్వ కార్యక్రమం కాదని, రాజకీయాలకతీతమైన ప్రజా కార్యక్రమని కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని, ఒక ప్రజా ఉద్యమంగా దీనిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 18 మంది ప్రముఖులను స్వచ్ఛ భారత్ ప్రచారకర్తలుగా వెంకయ్యనాయుడు సోమవారం నియమించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అస్కిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని, ఆయన స్ఫూర్తితోనే ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఇప్పటికే దేశంలో 68 శాతం మంది ఆరుబయటనే బహిర్భూమికి వెళుతున్నారని, దీనిని మార్చి అందరిలోనూ పరిశుభ్రతపై అవగాహన పెంచాల్సిన అవసరముందన్నారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మూడు అంశాలున్నాయని.. అందులో మొదటిది పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచి, వారిలో ఆలోచన రేకెత్తించడమన్నారు. రెండోది.. మౌలిక వసతులు కల్పించడమని, ఇది లేకుంటే ప్రజల దృక్పథం మారినప్పటికీ ప్రయోజనముండదన్నారు. ఇక చట్టాలను నియంత్రించడం మూడో ప్రధాన అంశమన్నారు. బిల్‌గేట్స్‌తో ఒకసారి మాట్లాడినపుడు ఇలాంటి కార్యక్రమాలకు డబ్బు ముఖ్యంకాదని, దృక్పథం ప్రధానమని అనారని గుర్తుచేశారు.

స్వచ్ఛభారత్ కోసం తెలంగాణ రాష్ర్టానికి రూ.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.10 కోట్ల టోకెన్ మొత్తాన్ని ఇస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ ఏపీని అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడిని ఆయన అభినందించారు. గతంలో పలువురు నేతలతో కలిసి సింగపూర్ వెళ్లినపుడు అక్కడ గైడ్ తమకు కాగితాలుగానీ, చెత్తనుగానీ నిర్లక్ష్యంగా రోడ్లపై వేయొద్దని సూచించారని, చెత్త వేస్తే ఏకంగా 500 డాలర్లు జరిమానా విధిస్తారని హెచ్చరించారని గుర్తుచేశారు. దీంతో తన గుండె జారిపోయిందన్నారు.

స్వచ్ఛ భారత్‌లో భాగస్వాములైన పలువురికి స్ఫూర్తిని కల్పించేందుకు తెలంగాణ, ఏపీలకు చెందిన 18 మంది వివిధ రంగాల ప్రముఖులను ప్రచారకర్తలుగా నియమించామని, వీరు తమ తమ మార్గాల్లో ఈ కార్యక్రమా

న్ని విస్తృతం చేయడంతోపాటు ఒక్కొక్కరు మరో తొమ్మిది మందిని నియమించుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రచారకర్తలుగా నియమితులైనవారిలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితతోపాటు సినీ హీరో పవన్‌కల్యాణ్, అమల అక్కినేని, బీసీసీఐ చైర్మన్ శివలాల్‌యాదవ్, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, మైహోం అధినేత డాక్టర్ జే రామేశ్వర్‌రావు, యశోదా ఆస్పత్రుల ఎండీ డాక్టర్ జీఎస్ రావు, ఇన్ఫోటెక్ సీఈవో డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ గోపీచంద్, సినీ నటుడు నితిన్, గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, బ్యాట్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఐటీ రంగ నిపుణులు జేఏ చౌదరి, బీవీఆర్ మోహన్‌రెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో ఆంధప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ, అధికారులు శంకర్ అగర్వాల్, అనితా అగ్నిహోత్రి, నీరజ్ పాల్గొన్నారు.

, ,

0 comments :

Political News

Sports News

Latest Jobs

Follow for Job Updates

Powered by Hey Telangana

Visitors Count

© 2014 Hey Telangana.
.