Facebook Twitter Google RSS

Top Stories

Politics

National News

Movie News

Latest Videos

కేరళ పర్యటనకు వెళ్లిన కేటీఆర్

Unknown     3:59 PM  No comments


 పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు రెండు రోజుల పర్యటనకు సోమవారం కేరళ బయలుదేరి వెళ్లారు. మంగళవారం (6వ తేదీ) కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించే జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంపై ప్రాంతీయ సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. 

కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని కోవలంలో జరగనున్న ఈ సదస్సులో కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, గోవా, మహరాష్ట్రతోపాటు అండమాన్, నికోబార్, లక్షద్వీప్‌కు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. జాతీయ ఉపాధిహామీ పథకంపై సమీక్షతోపాటు,ఈ పథకం పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. ఈ సదస్సులో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేంద్రనాథ్‌సింగ్, కేరళ సీఎం ఊమెన్‌చాందీ పాల్గొంటారు. వివిధ రాష్ర్టాల్లో ఉపాధిహామీ విజయాలను, పనితీరు నమూనాలపై చర్చిస్తారు. 

ఈ పథకాన్ని కుదించవద్దంటూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం, దీనితో జిల్లాల్లో జరిగిన ప్రగతిని, పలు విజయాలను మంత్రి కేటీఆర్ సదస్సులో ప్రస్తావిస్తారు. సోషల్ అడిట్స్‌పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చట్టం మీద ఎస్‌ఎస్‌ఏఏటీ డైరెక్టర్ సౌమ్యకిదాంబి ప్రజెంటేషన్ ఇస్తారు. ఈనెల 7న అక్కడి పంచాయతీలను కేటీఆర్ పరిశీలిస్తారు. ఈ సదస్సులో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొంటారు. 

మా ఎంసెట్ మేమే నిర్వహిస్తాం

Unknown     3:56 PM  No comments


ఎంసెట్ పరీక్షను తాము సొంతంగానే నిర్వహించుకొంటామని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్‌కు ఎంసెట్ నిర్వహణలో సహకారం అందిస్తామే తప్ప ఉమ్మడిగా పరీక్ష నిర్వహించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఆయ న రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఎంసెట్ పరీక్ష నిర్వహణపై స్పష్టత ఇచ్చారు.

ఎంసెట్‌పై కొంతకాలంగా రెండు రాష్ర్టాల మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావుతో గవర్నర్ ఇప్పటికే రెండుసార్లు సుదీర్ఘంగా చర్చించి పలు ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఏకాభిప్రాయానికి రావాలని గవర్నర్ గతంలో సూచించారు. అయినా సమస్య కొలిక్కి రాకపోవటంతో మరోసారి విడివిడిగా కూడా మంత్రులతో సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జగదీశ్‌రెడ్డి సోమవారం గవర్నర్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 75 ప్రకారం తామే ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణకు కలిసి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమతో పరస్పర అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం ఆయన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సమావేశమై పరిస్థితిని వివరించారు. ఎంసెట్ నిర్వహణలో తమ వైఖరిలో మార్పులేదని గవర్నర్‌తో మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేయడంతో ఒకటిరెండు రోజుల్లో ప్రవేశపరీక్షల తేదీలను ప్రకటించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అడ్మిషన్లలో ఏ ప్రాంతం వారికీ అన్యాయం జరుగకుండా, అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఇదివరకే ప్రవేశాల కమిటీలలో ఆంధ్రప్రదేశ్ అధికారులకు కూడా ప్రాతినిధ్యం కల్పించింది. 

గోపాల గోపాల పాటలు

Unknown     3:40 PM  No comments
గబ్బర్‌సింగ్ ఇంటర్వెల్ ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది. ఆ సమయంలో మహబూబ్‌నగర్ నుంచి వచ్చిన ఓ అభిమాని అందరినీ తోసుకుంటూ వచ్చి ఒక్క హిట్టివ్వన్నా..! రోడ్లమీద తిరగలేకపోతున్నాం. నీకు కథలు కావాలంటే చెప్పు నేనిస్తాఅన్నాడు. ఆ మాటలు విని కదిలిపోయాను అన్నారు పవన్‌కల్యాణ్. ఆయన వెంకటేష్‌తో కలిసి నటిస్తున్న చిత్రం గోపాల గోపాల. హిందీలో విజయవంతమైన ఓ మైగాడ్ చిత్రానికి రీమేక్ ఇది. సురేష్‌ప్రొడక్షన్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డి.సురేష్‌బాబు, శరత్‌మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కిషోర్ పార్థసాని (డాలి) దర్శకుడు. శ్రియ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్ర గీతాలు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. 

అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు. తొలిప్రతిని వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి నాకు ఏం కావాలనుందో తెలిసేదికాదు. మా అమ్మ అడిగినా,అన్నయ్యలు అడిగినా ఏం చెప్పాలో తెలిసేదికాదు. చివరికి ఈ ప్రపంచంలో ఇమడలేనని భావించి స్నేహితుడు ఆనంద్‌సాయితో కలిసి శ్రీశైలం అడవుల్లోకి పారిపోదామనుకున్నా అదే సమయంలో అన్నయ్య ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మన్నారు. ఆ తర్వాత అన్నీమర్చిపోయి కొంతకాలం దీక్ష, ధ్యానంలో వుండిపోయాను. 

రోజూ అన్నయ్య దెబ్బలు తగిలించుకుని ఇంటికి వస్తే ధ్యానం చేస్తే బాగుంటుందని ఆయనతో కథలు చెప్పేవాడిని. అన్నీ సమకూరుతున్నప్పుడు సలహాలు చెప్పడం కాదు. నీ వంతు నువ్వు కష్టపడి తరువాత ఇలాంటివి చెప్పు అప్పుడు నమ్ముతాను అని అన్నయ్య అన్నారు. ఆ మాటలు నాకు చెంపపెట్టులా అనిపించాయి. ఈ మాటల్ని నా తుది శ్వాస ఉన్నంత వరకు గుర్తుంచుకుంటాను. ఖుషి సినిమా తరువాత నాకు విజయాలు లేవు. అయినా అభిమానులు నా వెన్నంటే వున్నారు. ఇప్పటి వరకు నా గురించి భగవంతుడిని ఏమీ కోరుకోలేదు. దేవుడా...ఒక్క హిట్టివ్వు చాలు సినిమాల నుంచి వెళ్లిపోతా అని కోరుకున్నా. నేను ఒక్క హిట్టు కావాలని అడిగితే నాకు భగవంతుడు అంతకు మించి విజయాలు అందించాడు. 

ఎన్ని విజయాలు వచ్చినా భగవంతుడి ముందు మోకరిల్లే వుంటాను అన్నారు. వెంకటేష్ మాట్లాడుతూ కొత్త పంథాలో తీసిన సినిమా ఇది. పవన్ ఈ సినిమా ఒప్పుకోవడం అన్నింటికంటే ఆనందాన్ని కలిగించింది. సినిమాలో పవన్ చెప్పినట్టు లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాం పవన్‌తో చాలా సార్లు సినిమా చేయాలనుకున్నా కానీ కుదరలేదు. లేట్‌గా అయినా ఈ సినిమాతో వస్తున్నాం. ఈ సంక్రాంతికి ఈ సినిమాతో పవర్‌ఫుల్ విక్టరీ ఇస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో శరత్‌మరార్, డి.సురేష్‌బాబు, అనూప్ రూబెన్స్, దిల్‌రాజు, జెమిని కిరణ్, గౌతంరాజు,భరణి, అనంతశ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. 

వరల్డ్‌కప్ తుది జట్టును ప్రకటించిన బీసీసీఐ

Unknown     3:37 PM  No comments
జట్టు ఎంపికపై జరిగిన బీసీసీఐ సమావేశం ముగిసింది. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, అజ్యింకా రహానే, శిఖర్ ధావన్, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఆర్.అశ్విన్, అక్షర పటేల్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీలు తుది జాబితాలో ఉన్నారు. రవీంద్ర జడేజా స్టువర్ట్ బిన్నీ, రోహిత్ శర్మ లను కూడా జట్టుకు ఎంపిక చేశారు. ఈ రోజు ఉదయం జడేజా ఫిట్‌నెస్‌పై చర్చించాము. 10 రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడనే నమ్మకంతో అతనికి జట్టులో స్థానం కల్పించామని బీసీసీఐ సెలక్టర్లు తెలిపారు. 

108 పగ్గాలు కొత్త సంస్థకు

Unknown     1:00 PM  No comments


:ప్రమాద బాధితులను కాపాడే అత్యవసర సమయాల్లో ఆలస్యం లేకుండా దవాఖానకు తరలించి ప్రాణాలు కాపాడే అపర సంజీవనిగా పేరొందిన 108 సర్వీసులకు పునరుత్తేజం కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్వహణాపరమైన లోపాలతో సతమతమవుతున్న 108ను గాడిలో పెట్టేందుకు కాంట్రాక్టు సంస్థను మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నది. సర్వీసుల నిర్వహణ కోసం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నా.. అంబులెన్స్ వాహనాలు తరుచూ మొరాయిస్తుండటంపై దృష్టిపెట్టింది. చాలా అంబులెన్సులు పాతబడిపోవటంతో వాటి స్థానంలో కొత్త వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

నిర్వహణా సంస్థపై విమర్శల వెల్లువ: ప్రస్తుతం 108 సర్వీసులను ఈఎం ఆర్‌ఐ జీవీకే సంస్థ నిర్వహిస్తున్నది. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ సర్వీసుల నిర్వహణకు ప్రభుత్వంతో జీవీకే సంస్థ ఐదేండ్లకు ఎంవోయూ కుదుర్చుకుంది. దాని గడువు 2016 వరకు ఉంది. అయితే, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంతో కొత్త ఎంవోయూ చేసుకోవాల్సిఉండగా దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సర్వీసుల నిర్వహణలో సదరు సంస్థ తీరుపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాహనాలు సరిగా తిప్పకుండానే 95 శాతం వాహనాలు తిరిగినట్లు బిల్లులు పొందుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.

ఇలాంటి పరిస్థితుల్లో 108ను మరో సంస్థకు అప్పగించాలా? ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలా? అనే అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జీవీకేకంటే మెరుగైన సేవలందించగల సంస్థ ముందుకొస్తే 108 నిర్వహణను జీవీకే నుంచి తప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సర్వీసుల నిర్వహణకు ఇప్పటికే ఓ ప్రైవేటు సంస్థ సర్కారుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఐటీశాఖ పరిశీలనలో ఆ ఫైల్ ఉన్నట్లు సమాచారం. జీవీకే నిర్వహణాతీరుపై అసంతృప్తితో ఉన్న సర్కారు, కొత్త సంస్థకు 108ను అప్పగించవచ్చని తెలుస్తున్నది.

రాష్ట్రంలో మొత్తం 108 సర్వీసులో మొత్తం 337 అంబులెన్స్ వాహనాలుండగా ప్రస్తుతం 316 వాహనాలు నడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 108 సర్వీసులను మరింత బలోపేతం చేయాలన్న సంకల్పంతో ఒక్కో వాహనం నిర్వహణకు ప్రతి నెలా రూ.1.20 లక్షల చొప్పున 108 కాంట్రాక్టు సంస్థ అయిన జీవీకేకు ప్రభుత్వం చెల్లిస్తున్నది. మొత్తం వాహనాల నిర్వహణకు నెలకు రూ.3.83 కోట్లు, ఏటా రూ.44 కోట్లు అవసరం కాగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తున్నది.

జూన్ 2 నుంచి ఈ సర్వీసుల నిర్వహణకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించింది. గతంలో పలు దఫాలుగా నిధులు విడుదల చేసిన వైద్యారోగ్యశాఖ, సోమవారం రూ.12 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ నెలాఖరు వరకు ఉన్న పూర్తి బిల్లులు చెల్లించామని చెప్పారు. మరో మూడు నెలల కోసం రూ.8 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరోవైపు ఎన్‌హెచ్‌ఎం నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో 108 సర్వీసుల నిర్వహణకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 

2005లో ప్రారంభమైన 108 పథకం కోసం అప్పుడే అంబులెన్స్ వాహనాలు కొనుగోలు చేశారు. అవి పాతబడి పోవటంతో చాలా వరకు మూలనపడ్డాయి. రాష్ట్ర విభజనకు ముందు 150 వాహనాలు కొనుగోలు చేయగా, అన్నీ సీమాంధ్రకే కేటాయించారు. దీంతో రాష్ట్ర వాటాగా వచ్చిన పదేండ్లనాటి వాహనాలు తరచూ రోడ్లపై మొరాయిస్తున్నాయి. ఇప్పటికే మెడ్చల్‌లోని ఈఎంఆర్‌ఐ జీవీకే ప్రధాన కార్యాలయంలో పలు వాహనాలను వాడకుండా వదిలేశారు. దీంతో ప్రభుత్వం కొత్తగా 290 వాహనాలను కొనుగోలు చేసేందుకు రూ.58 కోట్లు కేటాయించింది. కొత్త వాహనాల కొనుగోలుకు సోమవారం పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌చందా టీ మీడియాకు తెలిపారు. 290 వాహనాలు కొనుగోలు చేయనున్న నేపథ్యంలో 108లోని 120 పాత వాహనాలను 104 సర్వీసులకు ఉపయోగించేందుకు మార్పులు చేయనున్నారు. 104 సర్వీసులు తక్కువ దూరం ప్రయాణిస్తుండటమేకాకుండా అవి అత్యవసర సేవలు కాకపోవటంతో పాత వాహనాలు సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. 

ప్రజా ఉద్యమంగా స్వచ్ఛ భారత్

Unknown     11:00 AM  No comments
 స్వచ్ఛ భారత్ ప్రభుత్వ కార్యక్రమం కాదని, రాజకీయాలకతీతమైన ప్రజా కార్యక్రమని కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని, ఒక ప్రజా ఉద్యమంగా దీనిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 18 మంది ప్రముఖులను స్వచ్ఛ భారత్ ప్రచారకర్తలుగా వెంకయ్యనాయుడు సోమవారం నియమించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అస్కిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని, ఆయన స్ఫూర్తితోనే ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఇప్పటికే దేశంలో 68 శాతం మంది ఆరుబయటనే బహిర్భూమికి వెళుతున్నారని, దీనిని మార్చి అందరిలోనూ పరిశుభ్రతపై అవగాహన పెంచాల్సిన అవసరముందన్నారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మూడు అంశాలున్నాయని.. అందులో మొదటిది పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచి, వారిలో ఆలోచన రేకెత్తించడమన్నారు. రెండోది.. మౌలిక వసతులు కల్పించడమని, ఇది లేకుంటే ప్రజల దృక్పథం మారినప్పటికీ ప్రయోజనముండదన్నారు. ఇక చట్టాలను నియంత్రించడం మూడో ప్రధాన అంశమన్నారు. బిల్‌గేట్స్‌తో ఒకసారి మాట్లాడినపుడు ఇలాంటి కార్యక్రమాలకు డబ్బు ముఖ్యంకాదని, దృక్పథం ప్రధానమని అనారని గుర్తుచేశారు.

స్వచ్ఛభారత్ కోసం తెలంగాణ రాష్ర్టానికి రూ.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.10 కోట్ల టోకెన్ మొత్తాన్ని ఇస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ ఏపీని అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడిని ఆయన అభినందించారు. గతంలో పలువురు నేతలతో కలిసి సింగపూర్ వెళ్లినపుడు అక్కడ గైడ్ తమకు కాగితాలుగానీ, చెత్తనుగానీ నిర్లక్ష్యంగా రోడ్లపై వేయొద్దని సూచించారని, చెత్త వేస్తే ఏకంగా 500 డాలర్లు జరిమానా విధిస్తారని హెచ్చరించారని గుర్తుచేశారు. దీంతో తన గుండె జారిపోయిందన్నారు.

స్వచ్ఛ భారత్‌లో భాగస్వాములైన పలువురికి స్ఫూర్తిని కల్పించేందుకు తెలంగాణ, ఏపీలకు చెందిన 18 మంది వివిధ రంగాల ప్రముఖులను ప్రచారకర్తలుగా నియమించామని, వీరు తమ తమ మార్గాల్లో ఈ కార్యక్రమా

న్ని విస్తృతం చేయడంతోపాటు ఒక్కొక్కరు మరో తొమ్మిది మందిని నియమించుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రచారకర్తలుగా నియమితులైనవారిలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితతోపాటు సినీ హీరో పవన్‌కల్యాణ్, అమల అక్కినేని, బీసీసీఐ చైర్మన్ శివలాల్‌యాదవ్, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, మైహోం అధినేత డాక్టర్ జే రామేశ్వర్‌రావు, యశోదా ఆస్పత్రుల ఎండీ డాక్టర్ జీఎస్ రావు, ఇన్ఫోటెక్ సీఈవో డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ గోపీచంద్, సినీ నటుడు నితిన్, గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, బ్యాట్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఐటీ రంగ నిపుణులు జేఏ చౌదరి, బీవీఆర్ మోహన్‌రెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో ఆంధప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ, అధికారులు శంకర్ అగర్వాల్, అనితా అగ్నిహోత్రి, నీరజ్ పాల్గొన్నారు.

ప్ర‌తి ఇంటికీ పుష్క‌లంగా తాగునీరు

Unknown     3:30 AM  No comments
హైదరాబాద్ నగర అభివృద్ధి, పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని అన్ని ప్రాంతాల ప్రజలకు మంచినీటి సరఫరా చేయడంపై దృష్టి పెట్టాలంటూ అధికారులకు జలమండలి చైర్మన్, సీఎం కేసీఆర్ సూచించారు. సోమవారం సచివాలయంలో జలమండలి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్రేటర్ పరిధిలోని తాగునీటి స్థితిగతులు, హైదరాబాద్ నగర మంచినీటి సరఫరాపై సీఎం కీలక
నిర్ణయాలు తీసుకున్నారు.

తొమ్మిది జిల్లాలలో అమలు చేయనున్న జలహారం పథకానికి సమానంగా గ్రేటర్ పరిధిలో కూడా జలహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ప్రజల తాగునీటి సరఫరా చేసే విషయంలో సర్కార్ ఖర్చుకు వెనుకాడదన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు చేపట్టాలని జలమండలి యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. నాగార్జునసాగర్ నుంచి మూ డు దశల్లో కృష్ణా నీటిని తీసుకువస్తున్నట్లే ప్రత్యామ్నాయంగా శ్రీశైలం నుంచి తాగునీటిని సేకరించే మార్గంపై దృష్టి పెట్టాలని సూచించారు. 

అతి తక్కువ ఖర్చుతో, అందులో పంపింగ్ ద్వారా కాకుండా గ్రావిటీ ద్వారా శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు మంచినీటిని తీసుకువచ్చి, జంట జలాశయాల్లోకి తరలించే పద్ధతులపై అధ్యయనం చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. గోదావరి, కృష్ణా పథకాలను రెండువైపుల నుంచి మంచినీటిని తెచ్చుకొనే వెసులుబాటు, నగరంలో వర్షపు నీరు నిలవకుండా జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు సంయుక్త సమావేశాల ఏర్పాటు, అవుటర్ రింగురోడ్డుకు అనుకుని ఉన్న గ్రామాలకు తాగునీటి పైపులైన్లు వేయడం, ప్రాంతాలకు అతీతంగా నీటి సరఫరా అందించడం లాంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

నగరంలో ప్రవేశపెట్టనున్న మన నగరం-మన సీఎం కార్యక్రమం అమలులో భాగంగా జలమండలికి సంబంధించి ప్రతి అంశాన్ని సీఎం క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, జలమండలి ఎండీ జగదీశ్వర్, ఈడీ సత్యనారాయణ, ప్రభాకర్ శర్మ, డైరెక్టర్లు కొండారెడ్డి, రామేశ్వరరావు, ఎల్లస్వామి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

హైదరాబాద్ శివార్లలో తీరనున్న నీటి కష్టాలు
ఇక శివారు ప్రాంతాల్లో మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనలను గతంలోనే జలమండలి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం, పరిపాలనాపరమైన అనుమతి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే నిధులను మంజూరు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఇందుకు వెంకయ్యనాయుడు హామీ ఇవ్వడంతో జలమండలి అధికారులు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంక్రాంతికి ఐ

Unknown     1:00 AM  No comments


శంకర్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఐ . ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాత. అమీజాక్సన్ కథానాయిక. మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్, పరాస్‌జైన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 14న ప్రేక్షకులముందుకురానుంది. విడుదల
కు ముందే ఈ చిత్రం సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అత్యధిక వీక్షకులతో సోషల్‌మీడియాలో సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. ప్రచార చిత్రాల్లో మనిషి, మృగరూపం సమ్మిళితంగా వున్న విక్రమ్ ఆహార్యం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. హాలీవుడ్ సినిమాల్ని తలదన్నే రీతిలో ప్రచార చిత్రాలున్నాయని ప్రశంసలు లభిస్తున్నాయి.

ఈ చిత్రంలో విక్రమ్ పాత్ర చిత్రణ భిన్న పార్శాల్లో సాగుతుందని, బాడీ బిల్డింగ్ పోటీల్లో జాతీయస్థాయిలో పతకాన్ని సాధించి మిస్టర్ ఇండియాగా పేరు తెచ్చుకోవాలనుకునే లింగేశ్వరన్ అనే యువకుడి జీవితంలో జరిగే అనూహ్య సంఘటనల సమాహారమే చిత్ర ఇతివృత్తమని దర్శకుడు శంకర్ తెలిపారు.

ఎ.ఆర్.రెహమాన్ స్వర రచనలో ఇటీవలే విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోందని, తెలుగులో భారీస్థాయిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. సురేష్‌గోపి, ఉపేన్‌పటేల్, సంతానం, రాంకుమార్ గణేషన్, శ్రీనివాసన్, సయ్యద్ సిద్ధిక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్, సంగీతం: ఎ.ఆర్.రహమాన్. 

కలెక్షన్ల తో పిచ్చేకిస్తున్న పీకే

Unknown     12:00 AM  No comments
అమీర్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన పీకే చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. విడుదలైన మూడువారాల్లోనే దేశీయంగా 300వందల కోట్లు, అంతర్జాతీయంగా 600కోట్ల కలెక్షన్ల మైలురాయిని దాటిన చిత్రంగా పీకే భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డును సృష్టించిందని ముంబై ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

గత కొన్నేళ్లుగా అమీర్‌ఖాన్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల్ని నమోదుచేస్తున్నాయి. గజిని చిత్రంతో బాలీవుడ్‌లో తొలిసారిగా 100కోట్ల మైలురాయిని అందుకున్నారు అమీర్‌ఖాన్. త్రీ ఇడియట్స్ చిత్రంతో 200కోట్ల మైలురాయిని అధిగమించారు. తాజాగా పీకే చిత్రం ద్వారా 300కోట్ల కలెక్షన్స్ సాధించారు. మతపరమైన విశ్వాసాల్ని ప్రశ్నించేలా పీకే చిత్రంలో కొన్ని అంశాలున్నాయని వివాదాలు చెలరేగుతున్నా.. ఇవేమీ కలెక్షన్స్‌పై ప్రభావం చూపకపోవడం విశేషమని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 

టాటా..బై..బై.. టెస్ట్ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై

Unknown     9:58 PM  No comments


మహేంద్ర సింగ్ ధోనీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అనంతరం ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ధోని 90 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా అందులో 60 టెస్ట్‌లకు నాయకత్వం వహించాడు.

అతని రిటైర్మెంట్ పై స్పందిస్తూ, ధోనీ అత్యుత్తమ భారత టెస్ట్ కెప్టెన్‌లలో ఒకరని, అతని నాయకత్వంలో భారత జట్టు టెస్ట్ ర్యాంకింగ్‌లో అగ్ర స్థానానికి ఎదిగిందని బీసీసీఐ ప్రశంసించింది. దీనితో వన్డే, టీ-20లలో మాత్రమే ధోనీ కొనసాగుతాడు.

మెల్‌బోర్న్ టెస్ట్‌లో ధోనీ పేరిట కొత్త రికార్డు నమోదైంది. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో తొమ్మిది మందిని అవుట్ చేయడంలో(8 క్యాచ్‌లు, 1 స్టంపింగ్) పాలు పంచుకున్న మొదటి భారత వికెట్ కీపర్ అయ్యాడు. ఆస్ట్రేలియా మీద ఈ ఫీట్ సాధించిన వారిలో ధోనీ మూడవ ఆటగాడు. 

అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్లో పదివేల పరుగులు పూర్తి చేసుకున్న మొదటి భారత కెప్టెన్ అయ్యాడు. పాంటింగ్, గ్రేమ్ స్మిత్, స్టీఫెన్ ఫ్లెమింగ్, అలెన్ బోర్డర్‌లు ఈ జాబితాలో ఉన్నారు. జనవరి 6 నుంచి జరగనున్న చివరి టెస్ట్‌లో భారత జట్టుకు కోహ్లీ నాయకత్వం వహిస్తాడు.

ధోనీ టెస్ట్ క్రికెట్ కెరీర్...
2005లో శ్రీలంకతో తొలి టెస్ట్ ఆడిన ధోనీ కెరీర్‌లో 90 టెస్టులు ఆడి 4876 పరుగులు చేశాడు. 60 టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్‌గా బాధ్యతలు వహించిన ధోనీ భారత్‌కు 27 టెస్ట్ విజయాలను అందించాడు. టెస్టుల్లో మొత్తం 256 క్యాచ్‌లు, 38 స్టంప్ ఔట్‌లు చేశాడు. టెస్టుల్లో ధోనీ వ్యక్తిగత అత్యధిక స్కోర్ 224 పరుగులు. టెస్టుల్లో 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేశాడు. ధోనీ కెప్టెన్సీలో టెస్టుల్లో వరల్డ్ నెంబర్ 1 గా భారత్ నిలిచింది. టెస్ట్ క్రికెట్‌కు అందించిన అపార సేవలను కొనియాడుతూ బీసీసీఐ ప్రశంసించింది.

ధోనీ..నీ టార్గెట్ 2015 వరల్డ్ కప్
 టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు సచిన్. ధోనీతో కలిసి ఆడిన క్షణాలను ఎంతో ఆస్వాదించానన్నాడు. ధోనీకి తదుపరి లక్ష్యం 2015 వన్డే ప్రపంచ కప్ కావాలన్నాడు. మీ సారథ్యం దేశానికే గర్వకారణం అని శృతి హాసన్ అంది. సురేశ్ రైనా స్పందిస్తూ మీ నిష్క్రమణ సాహసోపేత నిర్ణయం అని చెప్పాడు. 

గంగూలీ ఈ సిరీస్ మొత్తం ధోనీ ఆడితే బాగుండున్నాడు. రెండేళ్ళ పాటు ఆడే సత్తా ధోనీలో ఉందని గవాస్కర్ చెప్పాడు. దేశం గర్వించదగ్గ విజయాలు ధోనీ అందించాడని ప్రియమణి ప్రశంసించింది. 

టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగనున్న కోహ్లీ
హైదరాబాద్: టెస్టులకు ధోనీ కెప్టెన్సీపై కొంతకాలంగా విమర్శలు తలెత్తుతున్న విషయం విధితమే. జట్టు పగ్గాలు కోహ్లీకి ఇవ్వాలని సీనియర్లు సూచిస్తూ వచ్చారు. ఆసీస్‌తో జరిగే చివరి టెస్ట్‌కు కెప్టెన్‌గా కోహ్లీయే వ్యవహరించనున్నాడు.

Political News

Sports News

Latest Jobs

Follow for Job Updates

Powered by Hey Telangana

Visitors Count

© 2014 Hey Telangana.
.