Facebook Twitter Google RSS

108 పగ్గాలు కొత్త సంస్థకు

Unknown     1:00 PM  No comments



:ప్రమాద బాధితులను కాపాడే అత్యవసర సమయాల్లో ఆలస్యం లేకుండా దవాఖానకు తరలించి ప్రాణాలు కాపాడే అపర సంజీవనిగా పేరొందిన 108 సర్వీసులకు పునరుత్తేజం కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్వహణాపరమైన లోపాలతో సతమతమవుతున్న 108ను గాడిలో పెట్టేందుకు కాంట్రాక్టు సంస్థను మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నది. సర్వీసుల నిర్వహణ కోసం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్నా.. అంబులెన్స్ వాహనాలు తరుచూ మొరాయిస్తుండటంపై దృష్టిపెట్టింది. చాలా అంబులెన్సులు పాతబడిపోవటంతో వాటి స్థానంలో కొత్త వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

నిర్వహణా సంస్థపై విమర్శల వెల్లువ: ప్రస్తుతం 108 సర్వీసులను ఈఎం ఆర్‌ఐ జీవీకే సంస్థ నిర్వహిస్తున్నది. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ సర్వీసుల నిర్వహణకు ప్రభుత్వంతో జీవీకే సంస్థ ఐదేండ్లకు ఎంవోయూ కుదుర్చుకుంది. దాని గడువు 2016 వరకు ఉంది. అయితే, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంతో కొత్త ఎంవోయూ చేసుకోవాల్సిఉండగా దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సర్వీసుల నిర్వహణలో సదరు సంస్థ తీరుపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాహనాలు సరిగా తిప్పకుండానే 95 శాతం వాహనాలు తిరిగినట్లు బిల్లులు పొందుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.

ఇలాంటి పరిస్థితుల్లో 108ను మరో సంస్థకు అప్పగించాలా? ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలా? అనే అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జీవీకేకంటే మెరుగైన సేవలందించగల సంస్థ ముందుకొస్తే 108 నిర్వహణను జీవీకే నుంచి తప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సర్వీసుల నిర్వహణకు ఇప్పటికే ఓ ప్రైవేటు సంస్థ సర్కారుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఐటీశాఖ పరిశీలనలో ఆ ఫైల్ ఉన్నట్లు సమాచారం. జీవీకే నిర్వహణాతీరుపై అసంతృప్తితో ఉన్న సర్కారు, కొత్త సంస్థకు 108ను అప్పగించవచ్చని తెలుస్తున్నది.

రాష్ట్రంలో మొత్తం 108 సర్వీసులో మొత్తం 337 అంబులెన్స్ వాహనాలుండగా ప్రస్తుతం 316 వాహనాలు నడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 108 సర్వీసులను మరింత బలోపేతం చేయాలన్న సంకల్పంతో ఒక్కో వాహనం నిర్వహణకు ప్రతి నెలా రూ.1.20 లక్షల చొప్పున 108 కాంట్రాక్టు సంస్థ అయిన జీవీకేకు ప్రభుత్వం చెల్లిస్తున్నది. మొత్తం వాహనాల నిర్వహణకు నెలకు రూ.3.83 కోట్లు, ఏటా రూ.44 కోట్లు అవసరం కాగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తున్నది.

జూన్ 2 నుంచి ఈ సర్వీసుల నిర్వహణకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించింది. గతంలో పలు దఫాలుగా నిధులు విడుదల చేసిన వైద్యారోగ్యశాఖ, సోమవారం రూ.12 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ నెలాఖరు వరకు ఉన్న పూర్తి బిల్లులు చెల్లించామని చెప్పారు. మరో మూడు నెలల కోసం రూ.8 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరోవైపు ఎన్‌హెచ్‌ఎం నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో 108 సర్వీసుల నిర్వహణకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 

2005లో ప్రారంభమైన 108 పథకం కోసం అప్పుడే అంబులెన్స్ వాహనాలు కొనుగోలు చేశారు. అవి పాతబడి పోవటంతో చాలా వరకు మూలనపడ్డాయి. రాష్ట్ర విభజనకు ముందు 150 వాహనాలు కొనుగోలు చేయగా, అన్నీ సీమాంధ్రకే కేటాయించారు. దీంతో రాష్ట్ర వాటాగా వచ్చిన పదేండ్లనాటి వాహనాలు తరచూ రోడ్లపై మొరాయిస్తున్నాయి. ఇప్పటికే మెడ్చల్‌లోని ఈఎంఆర్‌ఐ జీవీకే ప్రధాన కార్యాలయంలో పలు వాహనాలను వాడకుండా వదిలేశారు. దీంతో ప్రభుత్వం కొత్తగా 290 వాహనాలను కొనుగోలు చేసేందుకు రూ.58 కోట్లు కేటాయించింది. కొత్త వాహనాల కొనుగోలుకు సోమవారం పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌చందా టీ మీడియాకు తెలిపారు. 290 వాహనాలు కొనుగోలు చేయనున్న నేపథ్యంలో 108లోని 120 పాత వాహనాలను 104 సర్వీసులకు ఉపయోగించేందుకు మార్పులు చేయనున్నారు. 104 సర్వీసులు తక్కువ దూరం ప్రయాణిస్తుండటమేకాకుండా అవి అత్యవసర సేవలు కాకపోవటంతో పాత వాహనాలు సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. 

,

0 comments :

Political News

Sports News

Latest Jobs

Follow for Job Updates

Powered by Hey Telangana

Visitors Count

© 2014 Hey Telangana.
.